Wednesday, May 23, 2007

Telugu Talli by "Kaviraju"

తెలుగు తల్లి

మాలదాసరి నోట, మహితభూసురనోట,
నొకతీరిమాటాడి యొప్పినావు!

మాలవాడలాబాట, మహితభూసురపేట,
నొక్కరీతిగ జిందు తొక్కినావు!

మాలగేస్తునింట, మహితభూసురినింట,
నొకరీతిబదముల నుంచినావు!

మాలపెద్దాలచెవి, మహితభూసురుచెవి,
నొకరీతి సామెతలూదినావు!

కన్నబిడ్డలదెస నొక్క కనికరంబె
చూపి, యెల్లవారికి దారి చూపినావు!
తల్లి! నీ మాట, నీ పాటదలుచుకొన్న
జలదరించుచు మేనెల్ల పులకరించు!

*0*

అతిశయభక్తిన్ వినుమా
ప్రతిభాషింపకయె తెనుగుభాష కుమారా!
అతిమధురం బతిపేశల
మతిపేయము కాదే బాసలన్నిటిలోలన్!

- "కవిరాజు" త్రిపురనేని రామస్వామి

- Telugutalli by "Kaviraju" Ramaswamy Tripuraneni


* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.


Tuesday, May 22, 2007

వీరగంధము

వీరగంధము
వీరగంధము దెచ్హినారము
వీరులెవ్వరొ దెల్పుడీ!
పూసిపోతము మెడను వైతుము
పూలదండలు భక్తితొ!

తెలుగు బావుట కన్నుచెదరగ
కొండవీటను నెగిరినప్పుడు-
తెలుగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు-

తెలుగువారల వేడి నెత్తురు
తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందునున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు-

ఇట్టి సందియమెన్నడేనియు
బుట్టలెదు రవంతయున్;
ఇట్టిప్రశ్నలడుగువారలు
లేకపోయిరి సుంతయున్!

నడుము గట్టిన తెలుగుబాలుడు
వెనుక తిరుగడెన్నడున్!
బాస ఇచ్హిన తెలుగుబాలుడు
పారిపోవడెన్నడున్!

ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము, మై నలందుము;
శాంతిపర్వము జదువవచ్హును
శాంతిసమరం బైనపిమ్మట!

తెలుగునాటిని వీరమాతను
జేసిమాత్రము తిరిగిరమ్మిక,
పలు తుపాకులు, పలు ఫిరంగులు
దారికడ్డము రాకతప్పవు!

తెలుగుబిడ్డా! మరిచిపోకురా!
తెలుగుదేశము పురిటిగడ్డరా!
కొక్కరకొ పాటపాడరా!
తెలుగువారల మేలుకొల్పర!

- "కవిరాజు" త్రిపురనేని రామస్వామి


- Veeragandhamu by "Kaviraju" Ramaswamy Tripuraneni


* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.

Monday, May 21, 2007

కుప్పుస్వామి శతకము

కుప్పుస్వామి శతకము

గొంటరుల దుంటరుల గుమిగూర్చి సృష్టి
జేసి చీటికి మాటికి డాసి వారు
తన్నుకోని చచ్హుచుండగ దనియుచుండు
గొప్పవానికి జేజేలు కుప్పుసామి.




ఏడొ, పద్నాలుగో, మూడొ యెన్నో, జగము
లెల్ల సృష్టించిటువంటి యీశుడొకరో
యిర్వురో ,యెందరో వారికెల్ల నేటి
కోళ్ళ నర్పింతు భక్తితో గుప్పుసామి.


చిన్నపిల్లకును దల్లి చెప్పునటుల
దెలుగు మాటల పొంకంబు దీర్చిదిద్ది
తెలిసి తెలియక యర్ధంబు తెలియునటుల
జెప్పబూనితి గరదలు కుప్పుసామి.


మున్ను పెద్దలు చెప్పినవెన్నో కలవు
ఎన్నకుండిన నీతులు కొన్ని కలవు
పేరుగా గ్రుచ్హి మెడలోన వేతువాని
గుతిలపడకుండ దాల్చుము
కుప్పుసామి.


కమ్మ నెత్తావి దెసలెల్ల జిమ్మునట్టి
గంధఫలి చెంతజేరదు గండు తేటి
తేనె లెదన్న సంగతి దెలిసికొనుచు
దప్పకీ నీతి స్మరియింపు కుప్పుసామి.



పూలుతెగబూసినప్పుడు మూగుచుండు
దేనెటీగలు పైబడి తేనె కొరకు
స్నేహితులు కొందరీరీతి జేరుచుందు
రప్పుడప్పుడు కనిపెట్టు కుప్పుసామి.



పండ్లచెట్టుక్రిందకు నెట్టి బాటసారి
యూరకే రాడు ఫలమును గోరివచ్చు
వాని నొకకంట గనిబెట్ట వలసియుండు
గోలకాకుండ సుంతైనా కుప్పుసామి.



ఒకనియెడ గృతఘ్నత జూపి యున్నవాని
నమ్మియుండుట తగదు లేశమ్ము కూడ
దనకు లాభంబు కల్గుచో దత్ క్షణంబ
ముప్పు తప్పక చేకూర్చు గుప్పుసామి.



ఒక్కమానవుండు డొక్కచీల్చినగాని
నారికేళఫలము నీరు నీదు
గొంటుకాని నిట్లు గోరాడకుండిన
నొప్పుకలుగనీడు కుప్పుసామి.



పిలువకుండ వచ్చి పెద్దమాటలు చెప్పు
వాని నెప్పుడు నమ్మవలదు, వలదు
మేలుకలుగబోదు మెరమెచ్చుల కతండు
తప్పుచెప్పుచుండు గుప్పుసామి.


నీతిలేనివాని నిరసించు జగమెల్ల
నీతిశాలికెప్పుడు నెగడు లేదు
నీతిశాలి నెపుడు నీతియే కాపాడు
గుజనుబారినుండి గుప్పుసామి.


నాలిమ్రుచ్చునెపుడు నమ్మరాదాతండు
కొంపదీయగలడు;కుదులకుండ
గొండచిలువ యట్టె గుటుకున దిగమ్రింగు
గుతిలపడగ జీవి గుప్పుసామి.

పరుని నీ ముందు దిట్టేడు వాడు

నిన్నునొరుని మొందట దిట్టక యుండబోడు

చనవు రవ్వంత వాని కొసంగరాదు

ముప్పుపుట్టు వానిని నమ్మ గుప్పుసామి.


* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.