Tuesday, May 22, 2007

వీరగంధము

వీరగంధము
వీరగంధము దెచ్హినారము
వీరులెవ్వరొ దెల్పుడీ!
పూసిపోతము మెడను వైతుము
పూలదండలు భక్తితొ!

తెలుగు బావుట కన్నుచెదరగ
కొండవీటను నెగిరినప్పుడు-
తెలుగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు-

తెలుగువారల వేడి నెత్తురు
తుంగభద్రను గలిసినప్పుడు
దూరమందునున్న సహ్యజ
కత్తినెత్తురు కడిగినప్పుడు-

ఇట్టి సందియమెన్నడేనియు
బుట్టలెదు రవంతయున్;
ఇట్టిప్రశ్నలడుగువారలు
లేకపోయిరి సుంతయున్!

నడుము గట్టిన తెలుగుబాలుడు
వెనుక తిరుగడెన్నడున్!
బాస ఇచ్హిన తెలుగుబాలుడు
పారిపోవడెన్నడున్!

ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము, మై నలందుము;
శాంతిపర్వము జదువవచ్హును
శాంతిసమరం బైనపిమ్మట!

తెలుగునాటిని వీరమాతను
జేసిమాత్రము తిరిగిరమ్మిక,
పలు తుపాకులు, పలు ఫిరంగులు
దారికడ్డము రాకతప్పవు!

తెలుగుబిడ్డా! మరిచిపోకురా!
తెలుగుదేశము పురిటిగడ్డరా!
కొక్కరకొ పాటపాడరా!
తెలుగువారల మేలుకొల్పర!

- "కవిరాజు" త్రిపురనేని రామస్వామి


- Veeragandhamu by "Kaviraju" Ramaswamy Tripuraneni


* అచ్చుతప్పులు, అక్షర దోషాలు నావి. తెలియజేస్తె తప్పులు దిద్దుకుంటాను.

No comments: